AP&TGOTHERSTECHNOLOGY

ఏడాదిన్నరలో ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్-సీఎం చంద్రబాబు

ఇన్నోవేషన్లకు ఏపీ టెస్ట్ బెడ్..

అమరావతి: ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయాలంటే ప్రతి ఇంటికీ డిజిటల్ కనెక్టివిటీ ముఖ్యమని సీఎం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలక సహకార ఒప్పందం కుదిరింది.

సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్-ఏబీఎన్‌పీ అమలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో ఏబీఎన్‌పీ అమలుకు రూ.2,432 కోట్ల మేర నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఏబీఎన్‌పీ కోసం ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం SPV ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి-రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర ఐ అండ్ ఐ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు MoC పై సంతకాలు చేశారు.

ఫేజ్-I 1,692 పంచాయతీల్లో:-  రాష్ట్రవ్యాప్తంగా 13,426 గ్రామ పంచాయతీల్లో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. 1,692 ఫేజ్-I పంచాయతీల్లోని నెట్ వర్క్ అప్ గ్రేడ్ చేయడం, 11,254 ఫేజ్-IIలోని గ్రామాల డిజటల్ కనెక్టివిటీని పూర్తి చేయడం… ఇక కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు తీసుకోవడం వంటి వాటిపై ఈ ఏబీఎన్‌పీ ప్రాజెక్టుతో పని చేయనుంది. 3,942 గ్రామాల్లో డిమాండ్ ఆధారంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంచే అంశంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

నెంబర్-1 స్థానం దక్కించుకునే:- “టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో… ఇతర దేశాల కంటే భారతదేశం చాలా ముందుంది. భారతదేశంలో బ్రాండ్ న్యూ టెక్నాలజీ అందుబాటులో ఉంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీఎస్ఎన్ఎల్ నెంబర్-1 నెట్ వర్క్ అవుతుందనే నమ్మకం ఉంది. బీఎస్ఎన్ఎల్ సంస్థకు ఆ కెపాసిటీ ఉంది. గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రాబోతోంది. టెలికాం, టెక్నాలజీ రంగంలో ఎలాంటి ప్రయోగాలు చేయాలన్నా… టెస్ట్ బెడ్‌గా ఉండేందుకు ఏపీ సిద్దం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫైబర్ నెట్ ఎండీ గీతాంజలి శర్మ, బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *