రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది..ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.. గురువారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి,విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, కర్నూలు,నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు పేర్కొన్నారు.. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు 19 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.. వర్షంతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

