AP&TG

త్వరలో ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం-ఉప ముఖ్యమంత్రి

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం…

 అమరావతి: పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ తన ప్రతి అడుగూ ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు. ‘నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు.

జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం:- ”రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంకు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలి. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా? లేదా? ఉంటే ఎలా ఉంది? అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలి. అసలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలి. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటలోకి రావాలి. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, రహదారులను మెరుగుపరచుకునేలా ఈ సాంకేతికత ఉండాలి. 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలి.

761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ:- కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మన్ పథకం కింద వచ్చే నిధులతోపాటు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం సాయం మొత్తం కలిపి రూ.1,158 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మించాలన్న సంకల్పంతో పనులు ప్రారంభించాం. అడవి తల్లిబాట పనులను వేగవంతం చేయండి.

రూ.2,123 కోట్ల సాస్కీ నిధులు:- తక్షణం పల్లె పండగ 2.0ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేయాలి. రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెల్లో 4007 కిలోమీటర్ల మేర రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి

పల్లెల్లో ప్రతి ఇంటికీ తాగునీరు:- పల్లెల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అకాంక్ష అన్నారు. రాష్ట్రంలో జల్ జీవన్ మినష్ పనులు ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రస్తుతం చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలి.

కోటి మందికి ప్రాపర్టీ కార్డులు:- మార్చినాటికి కోటి మందికి స్వమిత్వ యాజమాన్య హక్కు పత్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందజేసే విధంగా ముందుకు వెళ్లాలి. స్వమిత్వ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 613 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 5.18 లక్షల మందికి యాజమాన్య పత్రాలు అందించేందుకు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.

గత ముఖ్యమంత్రి ఫోటో:- గత ప్రభుత్వ హయాంలో చేపట్ట  గత ముఖ్యమంత్రి ఫోటోతో కూడిన పాసు పుస్తకాల కారణంగా ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. మన ప్రభుత్వంలో అలాంటి తప్పులకు తావుండదు. రీ సర్వే తర్వాత ఎవరి భూములు వారికి అప్పగిస్తూ ప్రాపర్టీ కార్డులు ఇస్తాం. రాజ ముద్రతో కూడిన కార్డులు అందిస్తాం. ఈ ప్రాపర్టీ కార్డులు వచ్చిన తర్వాత ఆయా స్థలాలు అమ్ముకునేందుకు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుంద”న్నారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, సర్వే విభాగం కార్యదర్శి కూర్మనాథ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన చీఫ్ ఇంజినీర్ బాలూ నాయక్, శ్రీమతి గాయత్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *