AP&TG

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటు-సీ.ఎం చంద్రబాబు

అమరావతి: రక్షణ, అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030) పై ముఖ్యమంత్రి సమీక్షించారు. నూతనంగా తీసుకువచ్చే పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్రంగా మారేలా ప్రయత్నించాలన్నారు. దేశ రక్షణ, అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని సీఎం అన్నారు. నేషనల్ సెక్యూరిటీకి  ప్రాధాన్యత ఇచ్చేలా పలు మార్పులు సూచించారు. ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు.

MSME ఉత్పత్తులకు నాణ్యతా బెంచ్‌మార్క్:- మిగతా రాష్ట్రాల కంటే ఈ రంగంలోని MSMEలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ఏడాదికి ప్రత్యేకంగా రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు, లాజిస్టిక్స్ సబ్సిడీ వంటివి నూతన పాలసీలో పొందుపర్చాలని సూచించారు. అనుంబంధ పరిశ్రమలలో ఉత్పత్తుల నాణ్యతలో బెంచ్‌మార్క్ ఉండేలా చూడాలన్నారు.

ప్రాంతాలవారీగా డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలు:- విశాఖపట్నం-శ్రీకాకుళంలో నావల్ క్లస్టర్…. జగ్గయ్యపేట-దొనకొండ ప్రాంతంలో మిస్సైల్, ఆయుధాల ఉత్పత్తులు…. కర్నూలు-ఓర్వకల్లులో మానవ రహిత విమానాలు, డ్రోన్ల తయారీ… లేపాక్షి-మడకశిర క్లస్టర్‌లో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్…. పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తిరుపతిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలని, అలాగే డీఆర్డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు మడకశిర క్లస్టర్‌లో భారత్ ఫోర్జ్, ఎంఎండబ్ల్యు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల:- ప్రస్తుతం రాష్ట్రంలో ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ క్లస్టర్‌లో 23 సంస్థలు, రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దీంతో 17 వేల మందికి ఉపాధి లభించింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, వాణిజ్య-పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *