సెప్టెంబర్ 15లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ కార్డుల పంపిణీ పూర్తి-మంత్రి నాదెండ్ల
అమరావతి: నిజాయితీ లేని గత ప్రభుత్వ దుష్ట ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నందివెలుగులో మంత్రి నాదెండ్ల మనోహర్ అదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కోటి 46 లక్షల మందికి స్మార్ట్ కార్డుల ద్వారా రాష్ట్రంలోనే నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలకు రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలు పుష్కలంగా అందుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని 29 వేల చౌక ధర దుకాణాలు:- గత మూడు నెలలుగా 65 సంవత్సరముల పైబడిన వృద్ధులు, వికలాంగులకు ప్రతినెల ఐదు రోజులు ముందుగా వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ కార్డుల పంపిణీ పూర్తి చేస్తాం అన్నారు. కార్డులోని QR కోడ్ స్కాన్ చేస్తే లబ్ధిదారుడు ఎప్పుడు సరుకులు తీసుకున్న సమాచారం వెంటనే ప్రభుత్వానికి చేరుతుంది. రాష్ట్రంలోని 29 వేల చౌక ధర దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్, గోధుమలు ప్రజలకు అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తున్నాం అన్నారు. ఏవైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా సంప్రదించవచ్చు. పోర్టబులిటీ సౌకర్యం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.