AP&TG

డేటాలేక్, సంజీవని, అమరావతి ప్రాజెక్టుల గురించి గేట్స్‌ కు వివరించిన సీఎం చంద్రబాబు

ఏపీలో టెక్ పాలన గ్రేట్-బిల్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. సచివాలయానికి చేరుకున్న గేట్స్ బృందానికి మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు స్వాగతం పలికారు. బిల్ గేట్స్‌ కు సీఎం, మంత్రులను పరిచయం చేశారు.

సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సందర్శించిన బిల్ గేట్స్ అక్కడ డిస్ ప్లే వాల్స్‌ పై ప్రదర్శించిన ప్రజంటేషన్లను తిలకించారు. ఆర్టీజీఎస్ నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని ఆసాంతం పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ముందుగా రాష్ట్రంలోని డేటా లేక్ వ్యవస్థ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలనూ అనుసంధానించామని తద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని తెలిపారు.

ప్రజల చేతుల్లోకి 921 సేవలు:- డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు, అమరావతి రాజధాని అంశాలపై అధికారులు బిల్ గేట్స్‌కు డిస్ ప్లే వాల్స్ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి దానిని ప్రజలకు వేగంగా అందిస్తున్నట్టు తెలియచేశారు. 42 రకాల సమాచారాన్ని ప్రజలు, రైతుల చేతుల్లోకి 921 సేవలు అందించటం ద్వారా తక్షణం స్పందించేందుకు ఆస్కారం కలుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవల్ని కూడా సులభతరం చేశామని…ప్రజల చేతుల్లోకి 921 సేవలను తీసుకెళ్లామని సీఎం వివరించారు. వీటిని ఆసక్తిగా పరిశీలించిన బిల్ గేట్స్ పౌరసేవలను సులభతరం చేయటం బాగుందని కితాబిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్న తీరును తెలుసుకున్నారు. రాష్ట్రంలో జీఎస్డీపీ పెరుగుదలను కూడా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి వివరించారు.

బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు:- ఏపీలోని ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రిని గేట్స్ అడిగారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులను భద్రపరుస్తున్నామని వివరించారు. భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేసి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ డాక్యుమెంట్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏపీ ఏఐ సెర్చ్ బార్ ను అందుబాటులోకి తెచ్చామని అధికారులు గేట్స్‌ కు ప్రజంటేషన్ ఇచ్చారు. దీనిని పరిశీలించిన బిల్ గేట్స్ పన్నుల వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.

సంజీవని ప్రాజెక్టు:- గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును గేట్స్ అత్యంత ఆసక్తిగా పరిశీలించారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి వైద్య పరీక్షల అనంతరం ఏం చర్యలు చేపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటే వారికి ఎలాంటి సేవలు అందుతున్నాయని గేట్స్ ఆరా తీశారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు చక్కగా ఉందని కితాబు ఇస్తూ… దట్స్ వెరీ నైస్ అంటూ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్ మార్పు, ఆహారం తీసుకునే అంశాల్లో సలహాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *