అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ శంకుస్థాపన
అమరావతి: హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్.. రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన భూమిపూజను తుళ్లూరు సమీపంలో బుధవారం ఉదయం సంస్థ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహించారు.
రెండు దశల్లో నిర్మాణం:– రాజధానిలో 21 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ కేర్ క్యాంపస్‌లో సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధనతోపాటు.. రోగుల సంరక్షణకు ఎక్స్‌లెన్సీ సెంటర్ అందుబాటులోకి తెస్తారు. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందిస్తారు. రూ.750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు సమకూరుస్తారు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర ప్రక్రియలకు ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌తో ఏర్పాటుచేసి..2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభించాలని భావిస్తున్నారు.. రెండో దశలో పడకల స్థాయి వెయ్యికి పెంచుతారు. ప్రత్యేక విభాగాలు, పరిశోధన విభాగాల ఏర్పాటు, క్లిష్టమైన, అధునాతన క్యాన్సర్ కేసులకు ప్రాంతీయ రిఫరల్ కేంద్రంగా దీనిని తీర్చిదిద్దుతారు.