జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ అమరావతి ఫెస్టివల్-మంత్రి కందుల దుర్గేష్
అమరావతి: తెలుగు సినిమా, సాంస్కృతిక, కళా, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా విజయవాడలోని పున్నమి ఘాట్, భవాని ద్వీపంలో వేడుకలు నిర్వహిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి దుర్గేష్ తెలిపారు.బుధవారం విజయవాడ భవాని ఐల్యాండ్, పున్నమిఘాట్లలో ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ ఏర్పాట్లను స్వయంగా మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీఎండి ఆమ్రపాలి కాట, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జెసి ఇలాకియా తదితరులు పరిశీలించారు.అనంతరం అయన మాట్లాడుతూ గురువారం కృష్ణా తీరంలో హౌస్ బోట్స్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అమరావతి ఫెస్టివల్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని వెల్లడించారు. జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ అమరావతి ఫెస్టివల్ జరుగుతుందని మంత్రి వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా, గోదావరి తీరాల్లో హౌస్ బోట్స్ ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్ లో సినిమా ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, కవితా పఠనాలు, సంగీతం, నృత్యం, నాటకాలు, వర్క్ షాప్ లు, సాంస్కృతిక భాషణలు, ఆధునిక కళా ప్రదర్శనలు సందర్శకులను కనువిందు చేస్తాయన్నారు. సాంకేతికతతో కూడిన ఆర్థిక వృద్ధిని సాధిస్తూనే, రాష్ట్ర సంస్కృతిని కాపాడుకోవాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దూరదృష్టికి ఈ ఉత్సవం ఒక నిదర్శనమన్నారు. ఈ ఫెస్టివల్ లో సినిమా, సాహిత్య రంగాలకు చెందిన దిగ్గజాలు, ప్రపంచవ్యాప్త కళాకారులు పాల్గొన్నాన్నారని, హెరిటేజ్ వాక్ తో పాటు ఘాట్ ఫెర్రీ ప్రయాణం, ఫుడ్ ఫెస్టివల్ తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

