సోమవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మరోక అల్పపీడనం ఏర్పడే అవకాశం
అమరావతి: దక్షిణ ఛత్తీస్‌గఢ్,దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే సోమవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మరోక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు కోస్తాలో చెదురుమదురుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు.
రానున్న మూడు రోజులు వాతావరణం వివరాలు:- ఆదివారం,, సోమవారం,,మంగళవారల్లో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.