లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఆంద్రప్రదేశ్-సీఎం చంద్రబాబు
సీఎం సమక్షంలో కుదిరిన ఎంఓయూ..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ను సముద్ర వాణిజ్యంలో తూర్పుతీర గేట్ వే గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. అంతర్జాతీయ షిప్పింగ్ లాజిస్టిక్స్, పోర్టుల నిర్వహణ లో అగ్రశ్రేణి కంపెనీ ఏపీ మోలర్ మేర్క్స్ అనుబంధ సంస్థ ఏపిఎం టెర్మినల్స్ రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధికి ఏపీ మారి టైమ్ బోర్డుతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రూ.9 వేల కోట్ల పెట్టుబడితో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలను ఏపీఎం టెర్మినల్స్ కల్పించనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ మారిటైమ్ బోర్డు- ఏపీఎం టెర్మినల్స్ సంస్థలు ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ పోర్టుల్లో ఆధునిక టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి నిర్వహణను చేపట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంది.
లాజిస్టిక్స్ హబ్ అఫ్ ఇండియాగా ఏపీ:- ఆంధ్రప్రదేశ్ ను దేశంలో లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను రూపోందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైలు, రోడ్డు, అంతర్గత జలమార్గాలు, వాయు మార్గాల ద్వారా రవాణా అయ్యే కార్గోకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపకల్పనలో సహకారం అందించాలని ఏపీఎం టెర్మినల్స్ సంస్థను సీఎం కోరారు. తెలంగాణా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు ఏపీలోని పోర్టులపైనే ఆధారపడుతున్నాయని.. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే సరకు అతి తక్కువ వ్యయంతో రవాణా అయ్యేలా ఈ ప్రణాళిక ఉండాలని సీఎం సూచించారు. ఏపీలో 1053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, లేదా హార్బర్ నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ చేపట్టామని సీఎం స్పష్టం చేశారు.