తిరుమల తరహాలో అమరావతి వేంకటేశ్వరుని ఆలయం అభివృద్ధి-సీ.ఎం చంద్రబాబు
2 దశల్లో రూ.260 కోట్లతో..
అమరావతి: రాజధాని అమరావతిలో రూ.260 కోట్లతో చేపట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని టీటీడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.గురువారం రాజధానిలోని వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ పనులు రెండు దశల్లో పూర్తి కానున్నాయి. మొదటి దశలో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రూ.120 కోట్లతో రెండోదశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు-సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.

