‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’తో సరికొత్త విప్లవం
ఉద్యోగాలు, స్టార్టప్‌లకు అవకాశం..
అమరావతి: క్వాంటం టెక్నాలజీ-బయాలజీ కలయికలో సరికొత్త విప్లవానికి రాజధాని అమరావతి కేంద్రం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం మేరకు పరిశోధనల విస్తృతి పెంచేలా ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో జీవ విజ్ఞాన శాస్త్రానికి ఉపకరించేలా “గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీని” రాష్ట్ర ప్రభుత్వం అమరావతి క్వాంటం వ్యాలీ పరిధిలోకి తీసుకొచ్చింది. సాంప్రదాయ కంప్యూటర్ల ద్వారా సాధ్యం కాని, ఆవిష్కరించలేని అంశాలను క్వాంటం బయో ఫౌండ్రీ ద్వారా కనుగోనేందుకు కానూ ఈ బయో ఫౌండ్రీని ఏర్పాటు చేయనున్నారు. మొండి వ్యాధులను నయం చేసేలా సరికొత్త ఔషధాలు, ఎంజైమ్ ఇంజినీరింగ్, అత్యాధునిక చికిత్సా విధానాలు, ఆధునిక వైద్య పరికరాల తయారీకి క్వాంటం బయోఫౌండ్రీ ఆవిష్కరణలు చేయనుంది. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం బయో ఫౌండ్రీలో TCS,IBM,CSIR,IIT ఢిల్లీ,CVJ సెంటర్, సెంటెల్లా AI వంటి అగ్రస్థాయి టెక్, పరిశోధనా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ ద్వారా భారీగా విదేశీ పెట్టుబడులతో పాటు, హై-వాల్యూ ఉద్యోగాలు, పరిశోధన ఆధారిత సంస్థలు రానున్నాయి.
లక్ష మంది యువతకు క్వాంటం శిక్షణ:- మే 2025లో ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వం ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ ఆలోచన కేవలం తొమ్మిది నెలల్లోనే కార్యరూపం దాల్చింది. భారత్‌లోనే అత్యాధునికమైన ఐబీఎం 133 (IBM 133-Qubit Quantum System Two) ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో అమరావతిలో ఏర్పాటు కానుంది. దేశంలోనే మొదటగా క్వాంటం పాలసీ అమలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.60కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇందులో భాగస్వామి అయ్యాయి. అలాగే, భారతదేశపు తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ కార్యకలాపాలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయి. ప్రపంచ స్థాయి సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు జరిగాయి. లక్ష మందికి పైగా యువత క్వాంటంలో శిక్షణ పొందుతున్నారు. క్వాంటం హ్యాకథాన్లకు 137 కాలేజీల నుంచి 20 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్వాంటంలో ప్రత్యేక శిక్షణ పొందిన 1,056 ఫ్యాకల్టీ కూడా సిద్ధంగా ఉన్నారు. క్వాంటం కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పనతో స్టార్టప్‌లకు విస్తృత అవకాశాలు లభిస్తాయి. హెల్త్‌కేర్, బయోటెక్, డీప్‌టెక్ స్టార్టప్‌లకు అమరావతి ప్రధాన కేంద్రంగా మారనుంది.

