160 గిగా వాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి-సీఎం చంద్రబాబు
సోలార్ ప్యానల్స్ తయారీ…
అమరావతి: ప్రజలపై విద్యుత్ భారాన్ని వేయకుండా… ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తోందని… అలాగే విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జాతి నిర్మాణంలో భాగంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రొత్సహిస్తున్నామని సీఎం చెప్పారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జెడ్ చింతువలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థకు చెందిన రెండు ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు గరువారం భూమిపూజ నిర్వహించారు. రూ.5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాంబిల్లి పెట్టుబడులు పెట్టనుంది. సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. రూ.4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్, రూ.1200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టును రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ…‘‘అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోంది. పెట్టుబడుల్లో ఈ జిల్లా భారత్లోనే అగ్రస్థానానికి చేరుతుంది. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇన్ గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు సుమంత్ సిన్హా ఈ సోలార్ వేఫర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాన్ని ఎంచుకుని వ్యాపారం మొదలు పెట్టారు.
రాంబిల్లిలో సౌర ఫలకాలు తయారవుతాయి:- “అభివృద్ధి సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఓ భాగం. ఎంత విద్యుత్ వినియోగిస్తే అంత అభివృద్ధి సాధించినట్టే. అందుకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రొత్సహిస్తున్నాం. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. రాంబిల్లిలో సౌర ఫలకాలు తయారవుతాయి. విద్యుత్ సంస్కరణల్ని ప్రారంభించింది మేమే. ఆ ఫలితాలు అందరికీ అందుతున్నాయి. ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 90 గిగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా పనులు గ్రౌండ్ అయ్యాయి.
40 లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు:- గ్రీన్ ఈవీ వాహనాలు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాం. ఆర్టీసీ కూడా 1,050 బస్సులు తీసుకువస్తోంది. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఈవీ బస్సులే. పేదలకు కూడా ఆర్టీసీ బస్సుల్లో తిరిగే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తాం. రాష్ట్రంలో 5 వేల ఛార్జింగ్ స్టేషన్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతీ ఇంటిపైనా విద్యుత్ ఉత్పత్తి కోసం పీఎం సూర్యఘర్ కింద సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలి. 40 లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.అటు రైతులు కూడా పీఎం కుసుమ్ కింద సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

