దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి-ప్రధాని మోదీ
అమరావతి: పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ, దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే భారతదేశం నిశ్చితాభిప్రాయమని పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని స్పష్టం చేశారు.భారత్లో పర్యటిస్తున్న కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మెదీ మాట్లాడారు.
ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్:- ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్ భారతదేశానికి కాక ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు. దీనిపై ప్రపంచ దేశాలు సమష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి బెదిరింపులను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతల విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకటేనని, శాంతి, సుస్థిరత కీలకమని, రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే శాంతి మరింత పటిష్టమవుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఎక్కడున్నా వారితో ఎప్పుడూ సంప్రదింపులు జరుపుతూ వారి భద్రతకు భారత్ కట్టుబడి ఉంటుందని చెప్పారు.
(భారత్, కెనడా మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఇరు దేశాల మధ్య యురేనియం సరఫరా సహా పలు కీలక రంగాల్లో చరిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అనంతరం రెండు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో భారత్కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, అడ్వాన్స్ డ్ రియాక్టర్ల తయారీలోనూ ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, రాడికలైజేషన్ లాంటి ఆలోచన ధోరణి మానవాళికి పెను సవాలుగా మారాయని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. వీటిని అరికట్టేందుకు రక్షణ రంగం, సముద్ర తీర భద్రతలో పరస్పర సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం-C.E.P.Aను త్వరలోనే ఖరారు చేయాలని ఇరు దేశాలు నిర్ణాయించాయి.)

