వందే భారత్ స్లీపర్ రైలును మాల్దా నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం హౌరా-గువాహటి మార్గంలో ప్రయాణించే తొలి వందే భారత్ స్లీపర్ రైలును మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించారు.అలాగే గువాహటి-హౌరా వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీంతో రెండు దిశల నుంచి రైలు సేవలు ప్రారంభమైయ్యాయి. హౌరా-గువాహటి కామాఖ్య మార్గంలో ప్రయాణ సమయం సుమారు 2.5 గంటలు తగ్గుతుంది. దీని వల్ల పర్యాటక రంగానికి పెద్ద ఊతం వస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

సౌకర్యాలు:- గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైలును రూపొందించారు. సాధారణ సర్వీసులో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది. పట్టాలపై రైలు ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్,, కుదుపులను తగ్గిస్తుంది. బోగీకి స్థిరత్వాన్ని ఇస్తుంది. ప్రయాణ సమయంలో శరీరానికి ఒత్తిడి వత్తిడి తగ్గిస్తుంది.99 శాతం సూక్ష్మజీవులను నశింపజేసే ఆధునిక డిస్ఇన్ఫెక్టెంట్ సాంకేతికతను వినియోగించారు. ప్రతి ప్రయాణికుడికి కొత్త బెడ్ లినెన్లు, టవల్స్ ను అందిస్తారు. ఆటోమేటిక్ స్లైడింగ్ తలుపులు ఉంటాయి. స్టేషన్ వచ్చినప్పుడు మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. వేగం, శుభ్రత, భద్రతతో పాటు ప్రయాణికులకు స్థానిక వంటకాలు అందిస్తారు. ప్రీమియం విమాన సేవల తరహాలో క్యాటరింగ్ సౌకర్యం టికెట్ ధరలోనే ఉంటుంది. స్థానిక రుచులకు ప్రాధాన్యం ఇస్తారు. కామాఖ్య నుంచి హౌరా వెళ్లే ప్రయాణికులకు అస్సామీ వంటకాలు అందిస్తారు. హౌరా నుంచి కామాఖ్య ప్రయాణించే వారికి బెంగాలీ వంటకాలు వడ్డిస్తారు.

