వ్యవసాయ పనులకు ఆటంకం కలగని విధంగా జీ రామ్ జీ అమలు-సీఎం చంద్రబాబు
అమరావతి: పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు… గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్ నెలలో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్(గ్రామీణ్)- వీబీ జీ రామ్ జీ పథకంపై ప్రజలకు, లబ్దిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు శనివారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, జనసేన తరపున మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా:- “రాష్ట్రాన్ని 10 సూత్రాల ఆధారంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా పని చేస్తోంది. ఇప్పుడు నిర్దేశించుకున్న 10 సూత్రాల అమలుకు జీ-రామ్-జీ స్కీం ఉపయోగపడుతుంది. ఆయా సూత్రాల అమలుకు జీ-రామ్-జీ స్కీంలోని అంశాలు ఏ మేరకు ఉపకరిస్తాయో విశ్లేషించుకుని ప్రణాళికలు రూపొందించాలి. ప్రణాళిక బద్దంగా వికసిత భారత్, స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాలు నెరవేరుతాయి. దీనిపై ఓ పక్క మూడు పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు అసెంబ్లీలో కూడా చర్చ చేపడతాం. డిప్యూటీ సీఎంతో కూడా మూడు పార్టీలకు చెందిన నేతలు సమావేశమై.. ఆయన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు:-మంత్రి కందుల దుర్గేష్- మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…”సీఎం చంద్రబాబు 2014-19 మధ్య కాలంలో సీఎంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ కింద గ్రామాల్లో ఎన్నో ఆస్తులను సృష్టించగలిగారు. ఇప్పుడు జీ రామ్ జీ పథకం ద్వారా నీటి భద్రత, గ్రామాల్లో మౌలిక వసతులు, జీవనోపాధికి ఆసరాగా నిలవడం, అలాగే వివిధ నిర్మాణాలు చేపట్టవచ్చు.
అవినీతికి తావు ఇవ్వని విధానం,మాధవ్:- బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ మాట్లాడుతూ…”గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పించే నిమిత్తం కొత్తగా తెచ్చిన జీ రామ్ జీ పథకంలో అవినీతికి తావు లేకుండా పటిష్టమైన వ్యవస్థను తీర్చిదిద్దారు. పూర్తి స్థాయిలో సాంకేతికతను వినియోగిస్తూ.. పథకాన్ని కేంద్రం రూపొందించింది. జియో రిఫరెన్స్ తో పాటు బయో మెట్రిక్ జియో స్పేషియల్ టెక్నాలజీ ద్వారా పథకాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ఉపాధి శ్రామికులకు దినసరి వేతనాల చెల్లింపుల్లో కూడా జాప్యం జరగదు.

