AP&TG

తీర ప్రాంత రక్షణ, జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి-ఉప ముఖ్యమంత్రి

సమష్టిగా పని చేద్దాం..

అమరావతి: ‘తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకం. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలోనే రోల్ మోడల్ గా నిలవాలని,, దీనికోసం అటవీ శాఖ సిబ్బంది సమష్టిగా పని చేస్తూ ముందుకు కదలాలి’ అని ఉప మంత్రిపవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.1052 కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత రక్షణకు మడ అడవులు బలమైన గోడల్లాంటివి… వీటిని పెంపొందించడంలో, రక్షించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేస్తుందని చెప్పారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో “మడ అడవుల పెంపుదల – వాటి నుంచి సుస్థిర ఆదాయం (MISHTI)” జాతీయ స్థాయి వర్క్ షాపు గురువారం విజయవాడలో ప్రారంభం అయ్యింది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “రాష్ట్రానికి తుపానుల ప్రభావం చాలా అధికం. దీనివల్ల ప్రతి ఏటా అపార నష్టం జరుగుతుంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో తుపానుల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి మడ అడవులను సమృద్ధిగా పెంచడం అనేది కీలకం. మడ అడవుల పెంపకంలో జీవ వైవిధ్యాన్ని రక్షించాలి. మడ అడవులను కొత్తగా పెంచడంతోపాటు, ఉన్న మడ అడవులను కాపాడుకోవడం ప్రధానం. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతంలో సుమారుగా 700  హెక్టార్లలో మడ అడవులను పెంచింది. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోను కొనసాగిస్తాం.

గ్రేట్ గ్రీన్ వాల్ విభిన్నమైన కార్యక్రమం:- రాష్ట్రంలో 50 శాతం భూభాగంలో గ్రీన్ కవర్ ఉండాలనే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. దీనిలో భాగంగా తీర ప్రాంతంలో గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా చేపట్టాం. తీర ప్రాంతంలో విభిన్నమైన దేశవాళీ మొక్కలను పెంచి వాటి ద్వారా ఆదాయం సాధించే ఓ బృహత్తర ప్రణాళిక దీనిలో దాగి ఉంది. పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా దాని నుంచి ఆర్థికంగా ఫలాలు స్వీకరించాలి అని కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. గ్రేట్ గ్రీన్ వాల్ సాకారం అయితే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లోనూ మొదలవుతుంది. దీనికి అటవీ శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉంది. అటవీ శాఖతోపాటు ఇతర శాఖలను కూడా సమన్వయం చేసుకొని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. దీని ద్వారా తీర ప్రాంతానికి అద్భుతమైన రక్షణతో పాటు, తీర ప్రాంతంలో ఉన్న వారికి మంచి ఆదాయం లభించే అవకాశాలు ఉంటాయి. దీనికి స్థానికంగా ఉన్న యువతను సమన్వయం చేసుకోవాలి. వారిని చైతన్య పరిచి కార్యక్రమం విశిష్టతను తెలియజేయాలి.

ఈ కార్యక్రమంలో అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు, ‘కాంపా’ జాతీయ ముఖ్య కార్యనిర్వహక అధికారి ఆనంద్ మోహన్, రాష్ట్ర అటవీశాఖ సలహాదారు మల్లికార్జున రావు, ఎన్.ఏ.ఈ.బీ. అడిషనల్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ రమేష్ కుమార్ పాండే తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *