గ్యాస్ లీక్‌తో 100 అడుగులకుపైగా ఎగసిపడుతున్న మంటలు
ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో..
గ్యాస్ లీక్‌తో వంద అడుగులకుపైగా ఎగసిపడుతున్న మంటలు – ఘటనాస్థలిని పరిశీలించిన తహసీల్దార్ శ్రీనివాసరావు – ఇరుసుమండ ప్రజలను అప్రమత్తం చేసిన రెవెన్యూ అధికారులు
అమరావతి: డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలం ఓఎన్జీసి వర్క్ ఓవర్ రిగ్ సైట్లో గ్యాస్ లీకైంది. సుమారు సుమారు 100 అడుగులకు పైగా మంటలు ఎగసిపడుతున్నాయి మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఇక్కడ గ్యాస్ లీక్ అయిందని స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఓఎన్జీసీ అధికారులకు తెలియజేశారు. ఓఎన్జీసి అధికారులు అక్కడకు చేరుకుని గ్యాస్ లీకేజిని అరికడతారని తహసీల్దారు శ్రీనివాసరావు వెల్లడించారు.
చుట్టుపక్కల 5 కి.మీ పరిధిలోని:- సంఘటనాస్ధలంలో పరిస్థితులను కలెక్టర్ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవవరప్రసాద్, కలెక్టర్ మహేష్, ఎస్పీ రాహుల్ మీనా, అధికారులు ఇక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చుట్టుపక్కల 5 కి.మీ పరిధిలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. మంటల ధాటికి సుమారు 500 కొబ్బరి చెట్లు కాలిపోయాయి. ఓఎన్జీసీలో బ్లో అవుట్‌కు సంబంధించి మంటలు ఎగసిపడుతున్నాయి.అగ్నికీలలు ధాటికి చుట్టుపక్కల వందలాది కొబ్బరి చెట్లు,వరి చేలుదెబ్బతింటున్నాయి. ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. స్థానికంగా ఉన్న వంట కాలువ నుంచి నీరు తీసుకుని ఫైర్ ఇంజన్ల ద్వారా ఫైర్ ఫైటింగ్ సిబ్బంది మంటలను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరో 24 గంటలు:– మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ మహేశ్‌కుమార్ తెలిపారు. మంటలు అదుపులోకి వస్తాయో లేదో తెలియాలంటే 24 గంటలు ఆగాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓఎన్జీసీకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మోరీ-5 ఆయిల్ వెల్‌కు, గెయిల్ పైప్‌లైన్‌కు సంబంధం లేదని చెప్పారు. మోరీ-5 అనేది ప్రత్యేకమైన బావి. మోరీ-5లో ఎంత సహజ వాయువు ఉందో అంచనా వేస్తున్నారు. మోరీ-5లో 20 నుంచి 40 క్యూబిక్ మీటర్ల నిల్వలు ఉండవచ్చని అంచనా. పరిసర గ్రామాల పాఠశాలల్లోని విద్యార్థులను ఖాళీ చేయించామన్నారు.
చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేదు:- మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటారని హెచ్‌పీసీఎల్ మాజీ డైరెక్టర్ ఎన్వీ చౌదరి తెలిపారు. గ్యాస్ ఎక్కణ్నుంచి వస్తుందో చూసి ఆపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇలాంటి ప్రమాదాలకు చాలా కారణాలు ఉంటాయని అన్నారు. గ్యాస్ ఎంత ఉంది ప్రెజర్ ఎంత ఉందనే దానిపై అంచనాకు వస్తారు. గ్యాస్ వెల్ ఎలా స్పందిస్తుందో అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ఘటనాస్థలం చూశాక ఏం చేయాలో ఓఎన్జీసీ నిపుణులు అంచనాకు వస్తారని చెప్పారు. గ్యాస్, మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేదని చెప్పారు.
గ్యాస్ లీక్‌పై సీఎం చంద్రబాబు ఆరా:- ఓఎన్జీసీ మోరీ -5 వెల్‌లో మంటలు చెలరేగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్, అధికారులతో సీఎం మాట్లాడారు. గ్యాస్ లీక్‌పై స్థానిక అధికారులతో మాట్లాడినట్లు సీఎంకు మంత్రులు తెలిపారు.

