తిరుపతిలో సెక్యూరిటీ, సేఫ్టీ వుంటుందన్న భావన భక్తుల్లో కల్పించాలి-సీ.ఎం చంద్రబాబు
ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం..
తిరుపతి: దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు పూర్తి రక్షణ కల్పించాలని, అప్పుడే పోలీసులు అందించే సేవల పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుందని శుక్రవారం తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుపతి, కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో సెక్యూరిటీ, సేఫ్టీ భావన ప్రజల్లో, భక్తుల్లో కల్పించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తున్న తిరుపతి పోలీసులకు అభినందనలు తెలియచేస్తున్నాను అన్నారు. సమాజ హితం లేని, రాజ్యాంగపరంగా లేని, చట్టవిరుద్ధమైన చర్యలు ఎప్పుడూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ అని ప్రకటించాం. కొందరు సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.2019-24 మధ్య పాలకులు శాంతిభద్రతలు భ్రష్టు పట్టించారు. తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని మండిపడ్డారు. కొందరు ఇప్పటికీ అదే రౌడీయిజాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారని,ప్రజాస్వామ్యంలో రాజకీయ విధానాల పేరుతో రౌడీయిజం చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హచ్చరించారు. కలియుగ వైకుంఠమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ఈ ప్రాంత పవిత్రతను కాపాడేలా పోలీసులు వ్యవహరించాలని నిర్దేశన చేశారు.

