మాట నిలుపుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటన నిలుపుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆనందంతో ముసిరిపోయిన నాగేశ్వరమ్మ, పవన్ కల్యాణ్ ఐదుసార్లు ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు.వృద్ధురాలి కోరిక వినగానే పవన్ కల్యాణ్‌తోపాటు అక్కడ ఉన్నవారంతా నవ్వేశారు.
రోడ్ల విస్తరణ పేరుతో:- 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో స్థానికుల ఇళ్లను అలాగే జనసేన కార్యకర్తల ఇళ్లను కూడా అధికారులు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో జనసేన కార్యకర్తలు లక్ష్యంగా ఈ పని చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పటంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ తమను కలిసేందుకు రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ కల్యాణ్‌ను ఆ సమయంలో కోరింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇచ్చిన మాట కోసం ఇవాళ ఇప్పటంలోని నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ వెళ్లారు.
ఆర్ధిక సాయం:- పవన్ కల్యాణ్ రావడంతో ఆయనకు నాగేశ్వరమ్మ ఆప్యాయంగా స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ కూడా ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె అవసరాల కోసం రూ.50 వేలు, ఆమె మనువడి చదువు కోసం రూ.లక్ష ఆర్థికసాయం అందించారు.

