DISTRICTS

సరికొత్త ఆలోచనలతో నుడాకు ప్రత్యేక గుర్తింపు-కలెక్టర్‌ హిమాన్షు శుక్ల

నెల్లూరు: జిల్లాలో నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా)కి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సరికొత్త ఆలోచనలతో, వినూత్నంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల నుడా అధికారులకు సూచించారు.మంగళవారం నెల్లూరు నగరంలోని వేదాయపాలెంలోని నుడా కార్యాలయంలో కలెక్టర్‌ అధ్యక్షతన నుడా అథారిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నుడా పరిధి వేగంగా విస్తరిస్తోందని, నుడా పరిధిలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ప్రజల్లో మంచి గుర్తింపు పొందేలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను నుడా చేపట్టాలని సూచించారు. ఎంఐజి హౌసింగ్‌ ప్రాజెక్టులతో పాటు పెద్ద నగరాల్లో ఉన్న వండర్‌లా, వాటర్‌ పార్కులు, అడ్వెంచర్‌ పార్కులు వంటి వినోదాత్మక ప్రాజెక్టులను అభివృద్ధి చేసి నుడా అంటే ప్రజల్లో ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ ఏర్పడేలా సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులను పిపిపి (PPP) పద్ధతిలో చేపట్టాలని సూచించారు.

నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, తాను రెండోసారి నుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టానని, చిరకాలం నిలిచిపోయే అభివృద్ధి పనులు చేపట్టాలన్నదే తన ఆశయమని తెలిపారు. ఇందుకు కలెక్టర్‌ సహాయసహకారాలు అందించాలని కోరారు. ఎన్‌టిఆర్‌ నెక్లెస్‌ రోడ్డు, నెల్లూరు రింగ్‌ రోడ్డు ఏర్పాటుకు సహకారం అందించాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. నుడా పరిధిలో కొన్ని భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, కొన్ని చోట్ల భూ సమస్యలు ఉన్నాయని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌ నెల్లూరు రింగ్‌ రోడ్డు డిజైన్లు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, మరో సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భూ సమస్యలను వెంటనే పరిష్కరించి నుడాకు అప్పగించాలని నుడా వైస్‌ చైర్మన్‌ను ఆదేశించారు. నుడా అభివృద్ధికి ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సమావేశంలో నుడా కార్యదర్శి అల్లంపాటి పెంచల్‌రెడ్డి, ప్లానింగ్‌ అధికారులు హిమబిందు, కాలేషా, ఏవోలు హేమలత, ఈశ్వర్‌రాజు, ఈఈ చంద్రయ్య, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రాఘవేంద్రన్‌, టూరిజం అధికారి ఉషశ్రీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *