సౌదీలో బస్సు ప్రమాదం- 42 మంది భారతీయులు దుర్మరణం
మృతుల్లో హైదరాబాదీలు….
హైదరాబాద్: మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికుల బస్సు బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించి బాధితులకు సహాయం అందించేందుకు కేంద్రం యుద్ద ప్రాతిపదికన రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులకు, మ్రుతుల కుటుంబాలకు అవసరమైన సహాయక చర్యలను సౌదీలోని భారత దౌత్యవేత్తలు ప్రారంభించారు.
కరీంనగర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ దుర్ఘటనపట్ల తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతోనూ మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే సౌదీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని సౌదీలోని భారత దౌత్యవేత్తలు తక్షణ సహాయక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.ఈ దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 8002440003 (టోల్-ఫ్రీ), 0122614093, 0126614276, 0556122301 పేరిట హెల్ప్‌లైన్ ను ఏర్పాటు చేశామని, సహాయక సహకారాల కోసం ఆయా నెంబర్లకు ఫోన్ చేస్తే తగిన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ సౌదీ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తాం. బాధితులకు సహాయర్థం పైన పేర్కొన్న టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మ్రుతుల ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధించారు. భవిష్యత్తులో యాత్రికుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు

