కాపు భవన్ కి మరో కోటి ప్రకటించిన మంత్రి నారాయణ
నెల్లూరు: అసంపూర్తిగా ఉన్న కాపు భవనాన్ని పూర్తి చేస్తానని మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు.. దాని అభివృద్ధికి తన పిల్లలు కోటి రూపాయలు ఇస్తారని ఆయన ప్రకటించారు. దాంతో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరో కోటి రూపాయలు ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేస్తానని వివరించారు. కాపు భవన్ లో జరిగిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో సతీమణి రమాదేవితో కలిసి ఆయన పాల్గొన్నారు. మంత్రి దంపతులకు కాప్స్ రాక్స్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కాపు భవన్ లో ఏర్పాటు చేసిన శివలింగాన్ని దర్శించిన మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 2014లోనే కాపు భవన్ కు మూడున్నర ఎకరాల స్థల సేకరణ చేసి భవన నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు. అప్పట్లోనే తన కుటుంబం తరఫున కాపు భవనానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం కాపు భవన్ బీసీ భవనాలు నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం కాపు భవన చూస్తే బాదేస్తుందని నారాయణ వ్యాఖ్యానించారు. కాపు భవన్ మరమతులకు 60 లక్షలు అవుతుందని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. కాపు భవన్ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బలిజ కాపు కులస్తులు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

