పరకామణి చోరీ కేసుపై ఫిర్యాదు చేసిన సతీష్ అనుమానాస్పద మృతి-MLA ఎం.ఎస్.రాజు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసుపై ఫిర్యాదు చేసిన టీటీడీ మాజీ AVSO అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన శుక్రవారం సాయంత్రం ఓ వీడియోను విడుదల చేశారు. పరకామణి చోరీకి సంబంధించిన కీలక పాత్రధారులు, సూత్రధారులు ఈ కేసు నుండి బయటపడేందుకు కీలక సాక్షిగా ఉన్న సతీష్ ను హత్యచేసి, తాడిపత్రిలోని రైల్వే ట్రాక్ పై మృతదేహాన్ని పడేసిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు. పరకామణిలో హుండీ డబ్బులను చోరీ చేసిన రవికుమార్, అతని వెనుక ఉన్న భూమన కరుణాకరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మరికొంత మంది సూత్రధారులు, పాత్రధారుల విషయాలపై ఆరా తీయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. పరకామణి కేసు విచారణ చివరిదశకు వచ్చిన తరుణంలో నేడు టీటీడీలో తన వాంగ్మూలం ఇచ్చేందుకు బయలుదేరిన సతీష్ తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై శవమై తేలడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు. వైసీపీ పాలనలో జరిగిన దుర్మార్గాలకు సంబంధించిన సాక్షులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శవరాజకీయాలు వైసీపీ నేతలకు వెన్నతోపెట్టిన విద్య అని తెలిపారు.

