మదపుటేనుగులను కట్టడి చేసే విన్యానం-ఆహారం అందించిన పవన్ కళ్యాణ్
మావటీలకి రూ.50 వేలు బహుమానం..
అమరావతి: మదపుటేనుగుల దాడుల నుంచి పంట పొలాలను, మనుషులను రక్షించేందుకు ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చిన కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆదివారం, చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రానికి చేరుకున్నపవన్ కళ్యాణ్, ఏనుగుల శిక్షణ, సంరక్షణ తదితర అంశాలను స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో కుంకీ ఏనుగులు చూపుతున్న మెలకువలు, ఇటీవల జరిగిన ఆపరేషన్ల తీరును అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కుంకీ ఏనుగులు ప్రత్యేకంగా చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
ముసలమడుగు ఏనుగుల క్యాంపు ప్రారంభోత్సవం:- అనంతరం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలమడుగులో ఏర్పాటు చేసిన నూతన ఏనుగుల క్యాంపును ప్రారంభించారు. అందుకు సంబంధించిన శిలా ఫలకాన్ని ప్రారంభించారు. ఏనుగుల క్యాంపులో ఏర్పాటు చేయనున్న గజారామం నగర వనానికి పునాదిరాయి వేశారు. సౌర శక్తితో పని చేసే వేలాడే అటవీ ఏనుగుల నిరోధక కంచె నిర్మాణానికి పునాది రాయి వేశారు.
మావటీలకి ఉప ముఖ్యమంత్రి రూ.50 వేలు బహుమానం:- కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకీ ఏనుగులను స్వీకరించేటప్పుడు వీటిని జాగ్రత్తగా చూసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ విధంగానే పలమనేరు ఎలిఫెంట్ క్యాంపులో మావటీలు.. కుంకీల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వారి పని తీరు మెచ్చుకుంటూ, పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు రూ.50 వేలు బహుమానంగా అందించారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికా ర్జునరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, అనంతపురం, తిరుపతి ఫారెస్ట్ కన్జర్వేటర్లు శ్రీమతి యశోద బాయి, చిత్తూరు డీఎఫ్ఓ సుబ్బురాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

