AP&TG

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలకు నిర్ధిష్ట గడువులోగా పరిష్కారానికి హామీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని.భాస్కర్ ఐ.ఎ.యస్ అధ్యక్షతన చర్చలు జరిగాయని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి.జాని పాషా,సెక్రటరీ జనరల్ విప్పర్తి.నిఖిల్ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరుకు:- సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ల దస్త్రం తిరిగి ఆర్ధిక శాఖకు పంపించి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని,ఇంటింటి సర్వేలు అవసరం అయితే ఆరు మాసాలకు ఒకసారి లేదా సంవత్సరంలో రెండు మూడు సార్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటానని, ఆరుసంవత్సరాలపాటు ఒకే క్యాడర్ లో పనిచేసిన ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరుకు చర్యలు ప్రారంభం చేసానని,దివ్యాంగ ఉద్యోగులకు క్షేత్ర స్థాయి విధుల నుండి విముక్తి కల్పించడం కోసం స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని,పండుగలు,ఆదివారాలు,సెలవు రోజుల్లో ఎటువంటి విధులు అప్పగించకుండా ఆదేశాలు జారీ చేస్తున్నామని, ఆన్లైన్ విధానంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ తీసుకొని వస్తామని,సెలవులు మంజూరుకు ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ విధానం ద్వారా 24గంటల్లో ఆటోమేటిక్ అప్రూవల్ ఏర్పాటు చేస్తామని,పదోన్నతుల సమస్యల పరిష్కారం కోసం అన్నీ శాఖల మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేయడానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారని తెలిపారు.

జి.ఒ 523ని సవరించాలని:- ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని,ఉద్యోగులకు స్పోర్ట్స్ మీట్ డిసెంబర్ మాసంలో ఏర్పాటు చేస్తామని,ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతీ మూడు మసాలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తామని సైతం హామీ ఇచ్చారు.అనంతరం సంక్షేమ విద్యాసహాయకులు మరియు వార్డు విద్యా కార్యదర్శులకు స్కూల్ టాయిలెట్స్ ఫోటోలు తీసే విధుల నుండి విముక్తి కలిపించాలని కోరిన మీదట సెక్రటరీ సంభందిత శాఖ మంత్రితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని,వార్డు సచివాలయ కార్యదర్శుల పదోన్నతులకు సమస్యగా ఉన్న జి.ఒ 523ని సవరించాలని కోరగా మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి పరిష్కారం చేస్తామని,అలాగే అన్నీ విభాగాల సచివాలయ ఉద్యోగుల సమస్యలు చర్చించడం జరిగిందని పేర్కొన్నారు.

రాష్ట్ర సచివాలయాల శాఖ కార్యదర్శి వారి నుండి నివేదన తెప్పించి న్యాయమైన అన్నీ సమస్యలు నిర్ధిష్ట గడువులోగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ చర్చల్లో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం.శివప్రసాద్ ఐ.యఫ్.యస్-సచివాలయాల శాఖ అదనపు కమీషనర్ జి.సూర్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *