DISTRICTS

ప్రారంభానికి ముస్తాబైన నెల్లూరు స్మార్ట్‌ స్ట్రీట్‌ బజార్‌- ప్రారంభోత్సవం చేయనున్న సీఎం

ప్రారంభోత్సవానికి 120 షాపులు..

నెల్లూరు:  చిరువ్యాపారులకు ఆర్థిక పరిపుష్టి, మహిళల స్వయం ఉపాధే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ ప్రత్యేక చొరవతో నెల్లూరులోని మైపాడు గేట్‌ సెంటర్‌లో నిర్మించిన స్మార్ట్‌ స్ట్రీట్‌ బజారు ప్రారంభానికి ముస్తాబైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు పర్యటన సందర్భంగా శుక్రవారం స్మార్ట్‌ స్ట్రీట్‌ బజార్‌ ప్రారంభోత్సవానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. స్ట్రీట్‌ బజారులో 120 కంటైనర్‌ షాప్‌ లను ఏర్పాటుచేశారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ఈ కంటైనర్‌ దుకాణాలను కేటాయించారు. స్మార్ట్‌ స్ట్రీట్‌లో 8.4 కోట్లతో 200 షాపులను ప్రభుత్వం మంజూరు చేయగా, తొలివిడతలో 30 కంటైనర్లలో 120 షాపులను అధికారులు సిద్ధం చేశారు.  మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్‌ స్ట్రీట్‌ ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టగా, అందులో తొలుతగా నెల్లూరు సిటీలో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా స్మార్ట్‌ స్ట్రీట్‌ బజార్లో 120 షాప్‌లు ప్రారంభమవుతున్నాయి.

నారాయణ సొంత నిధుల నుంచి:- ఒక్కో షాపుకి నాలుగు లక్షలు ఖర్చు అవుతుండగా, అందులో రెండులక్షల వ్యయాన్ని కార్పొరేషన్‌, మెప్మాలు భరిస్తున్నాయి. మిగిలిన రెండు లక్షల్లో కంటైనర్‌కి లక్షన్నర రూపాయలు, పెట్టుబడి సాయం కింద మరో 50వేల రూపాయలు కేవలం రూపాయి వడ్డీకే లోన్‌ ఇప్పించి ప్రోత్సహిస్తున్నారు. ఆ రెండు లక్షల్లో కూడా పి-4 పథకంలో భాగంగా 120మంది లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు మంత్రి నారాయణ సొంత నిధుల నుండి మొత్తం కోటీ 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కింద అందిస్తున్నారు. స్మార్ట్‌ స్ట్రీట్‌ లో పోల్స్‌ కి సీసీ కెమెరాలు, వెఫై  సౌకర్యం కల్పించారు. ఏదైనా అనౌన్స్‌మెంట్‌ చేయాలంటే దీనికే స్పీకర్స్‌ అమర్చారు.వ్యాపారంలో మెలకువలు నేర్పేందుకు మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ కూడా ఇస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *