AP&TG

శ్రీశైలంలొ తిరుమల తరహాలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు-సీ.ఎం

సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…

అమరావతి: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్య క్షేత్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవాదాయ, అటవీశాఖ అధికారులతో సీఎం చర్చించారు. ఆదివారం శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయశాఖ, అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండూ కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్రాభివృద్ధి పై సీఎం చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 16 తేదీన ప్రధాని మోదీ శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించు కొనేందుకు శ్రీశైలం రానున్న దృష్ట్యా ఆయనతో ఆలయ అభివృద్ధిపై  చర్చించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్:- ఆధ్యాత్మికంగా పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని,,భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్ర అభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు.

రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయంగా:- రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ అటవీ, గిరులపైనే ఉన్నాయని వారసత్వంగా వచ్చిన ఈ ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరుమల తర్వాత అతిపెద్ద ఆలయంగా శ్రీశైలం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా భక్తులకు విస్తృతమైన సౌకర్యాలను కల్పించాల్సి ఉందని అన్నారు. పచ్చదనం పెంపు, అటవీ ప్రాంతాల అభివృద్ధిపై ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని దీనికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని సీఎం అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *