విజయవాడ ఉత్సవ్‌లో గిన్నిస్ రికార్డు ప్రయత్నం-దసరా వేషధారణలో 3000 మంది కళాకారుల కార్నివాల్
ప్రత్యేక ఆకర్షణగా రథంపై అమ్మవారి ఊరేగింపు…
అమరావతి: దసరా ఉత్సవాల సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో జరుగుతున్న “విజయవాడ ఉత్సవ్”లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. విజయదశమి పండుగ శోభను దేశ, విదేశాల్లో చాటిచెప్పేలా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలన్న మహోన్నత లక్ష్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక కార్నివాల్‌కు శ్రీకారం చుట్టారు.
3000 మంది కళాకారులతో:- అక్టోబర్ 2వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విజయవాడ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమయ్యే ఈ కార్నివాల్, బెంజి సర్కిల్ వరకు వైభవంగా సాగనుంది. నాసిక్ డోలు, కాళికా వేషాలు, పోతురాజులు, లంబాడి సాంప్రదాయ నృత్యం, గుస్సాడి, కేరళ డ్రమ్స్, కర్ర సాము, తీన్మార్, సన్నాయి మేళం, కథాకళి, స్టిక్ వాకర్స్, పగటి వేషాలు, వీరనాట్యం, గరగరలు, కొమ్ముకోయ, దింసా, తప్పిటగుళ్ళు, వీరాగాసలు, బేబీ నాట్యం, చెక్కభజనలు, పులివేషాలు, కోలాటం, గారడి, యక్ష కళలు, బేతాళ సెట్టు, అఘోరాలు, గొరిల్లా డాన్స్ లు, డప్పు వాయిద్యాలు వంటి దసరా వేషధారణలో 3000 మంది కళాకారులు పాల్గొని, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయనున్నారు. కళ, సాంస్కృతిక వైభవం సమ్మేళనంగా జరగనున్న ఈ ప్రదర్శన జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారనుంది.
అమ్మవారి రథోత్సవం ప్రధాన ఆకర్షణ:- ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్న ఈ కార్నివాల్‌లో ప్రధాన ఆకర్షణగా ప్రత్యేకంగా రూపొందించిన రథంపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. మంగళవాయిద్యాలు, బృందాల నృత్యాలు, సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక విన్యాసాలు ఈ ఊరేగింపుకు ప్రత్యేక కాంతి నింపనున్నాయి. ఇది విజయవాడ దసరా మహోత్సవాలకు మరింత గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా, ప్రజల్లో భక్తి, ఆనందాలను కలగలిపే మహోత్సవ క్షణాలుగా నిలవనుంది.