కనకదుర్గమ్మను దర్శించుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు విచ్చేసిన డీకే శివకుమార్ కుటుంబానికి ఆలయ అధికారులు, వేదపండితులు, రాజకీయ ప్రముఖులు సాదర స్వాగతం పలికారు. ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన శివకుమార్ దంపతులు, కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటం, ప్రసాదాలను ఆయనకు అందజేశారు.
రెండు రాష్ట్రాల ప్రజలు:- ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ ”విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఎంతో పవిత్రమైనది. అమ్మవారిని దర్శించుకోవడం మా కుటుంబానికి ఒక విశేషమైన అనుభూతి. అమ్మవారి ఆశీస్సులతో రెండు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, సమాజం శాంతి, అభివృద్ధితో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. ఈ పుణ్యక్షేత్రంలో దసరా ఉత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయని, దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు, విఐపిలకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందని డీకే శివకుమార్ కొనియాడారు.