టిడ్కో గృహాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోండి-కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకంలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహాల మంజూరుకు అర్హులైన ప్రజలందరూ దరఖాస్తు చేసుకుని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ నందన్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానిక సచివాలయాన్ని సందర్శించి అమెనిటీస్ కార్యదర్శి ద్వారా అర్హత పరిశీలించుకుని, దరఖాస్తుకు అవసరమైన పూర్తి వివరాలను పొందాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించిన:- బి.పి.ఎస్ పథకాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన ప్లాన్ ను అతిక్రమించి కట్టడాలను చేపట్టవద్దని, నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి చేస్తామని కమిషనర్ తెలియజేశారు.
లోతట్టు ప్రాంతాలపై:- రానున్న వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, అత్యవసర పరిస్థితిలో నెల్లూరు నగరపాలక సంస్థ నుంచి యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నామని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి, సిటీ ప్లానర్ హిమబిందు, మేనేజర్ రాజేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.