నెల్లూరు-కడప హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం-7 మంది నెల్లూరు నగరవాసలు మృతి!
అమరావతి: నెల్లూరు జిల్లాలోని సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై (AP-40HG-0758) కారును టిప్పర్ లారీ ఢీకొట్టిన సంఘటనలో 7 మంది మరణించారు. బుధవారం ఉదయం కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలిలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కారును టిప్పర్ ఢీకొట్టిన తరువాత వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్, కారును ఢీకొట్టింది. దీంతో టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక పాప ఉన్నారు.
నెల్లూరు నగరవాసులు:- కారు తాళ్లూరు రాధా పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ముత్తుకూరు గేటు సమీపంలో గుర్రం వారి వీధికి చెందినవారుగా తెలుస్తోంది. చనిపోయిన వారు T.రాధా, శేషం సారమ్మ, నల్లగొండ.లక్ష్మి, శేషం తేజ, శ్రీనివాసులుగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఆత్మకూరులో ఒకరిని పరామర్శించేందుకు ప్రభుత్వ వైద్యశాల వద్దకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

