కొత్త ఆరోగ్య బీమా పథకం అమల్లో పెరిగిన ప్రభుత్వాసుపత్రుల పాత్ర-మంత్రి సత్యకుమార్
అరుదుగా వాడుకునే 197 సేవలకు..
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మిశ్రమ(హైబ్రిడ్) విధానంలో అందరికీ ఆరోగ్య బీమా పథకం అమల్లో ప్రభుత్వాసుపత్రుల పాత్రను పెంచారు. ఈ దిశగా 155 రకాల వైద్యసేవలను ప్రభుత్వాసుపత్రులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో…ప్రభుత్వాసుపత్రులకు ప్రస్తుతం రిజర్వ్ చేసిన 169 రకాల సేవలతో నూతన విధానంలో మొత్తం 324 రకాల వైద్యసేవలను ప్రభుత్వాసుపత్రుల ద్వారా ప్రజలకు లభిస్తాయి.
ప్రస్తుతం డా.యన్.టి.ఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా అందించబడుతూ అత్యంత అరుదుగా లబ్ధిదారులు వాడుకుంటున్న 197 రకాల వైద్యసేవలకు ట్రస్టు ద్వారా ఉచితంగా సేవలందించబడతాయి.అలాగే లబ్ధిదారులకు ఉచితంగా అందించబడుతున్న వైద్యసేవలు, కొత్త మిశ్రమ(హైబ్రిడ్) విధానం కింద వాటిని క్రమబద్ధీకరించిన వైనాన్ని వైద్యారోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ సమీక్షించారు.
పెరిగిన సేవల సంఖ్య:- ఆరోగ్య శ్రీ పథకంలో అందించబడిన వైద్యసేవల సంఖ్యను ఎక్కువగా చేసి చూపటానికి గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని వైద్యులు మంత్రికి వివరించారు. ఇందుకోసం అనుసరించిన విధానాలు
1.డెంగీ,టైఫాయిడ్ మరియు పారా టైఫాయిడ్ జ్వరాల చికిత్స విధానం మరియు ప్యాకేజీ విలువలు ఒకటే అయినా గత ప్రభుత్వం వాటిని విడివిడిగా చూపించింది. దీనికి బదులుగా వాటిని ‘ ‘జ్వరాలు ‘ అన్న కేటగిరీలో చేర్చడం జరిగింది.
2.అదే రీతిన గుండెకు సంబంధించిన రైట్ హార్ట్ కేథటరైజేషన్, లెఫ్ట్ హార్ట్ కేథటరైజేషను (స్టెంట్ వేయడం) ఒకే కేటగిరీ కింద నూతన బీమా పథకంలో చేపడతారు.
3.వివిధ రకాలుగా చూపబడుతున్న అల్సర్ చికిత్సలను ఏకీకృతం చేసి అల్సర్ చికిత్సలు అన్న కేటగిరీలో చేర్చారు .ఈ విధంగా సారూప్యత కలిగిన 319 రకాల వైద్యసేవలను 133 రకాలుగా వర్గీకరించారు. ఉన్నత వైద్యుల బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసి నూతన వర్గీకరణను సూచించింది.
ప్రభుత్వాసుపత్రులకు కేటాయించబడిన సేవలు:- వివిధ ప్రభుత్వాసుపత్రులల్లో ఏర్పాటు చేయబడిన మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న వైద్యసిబ్బందిని దృష్టిలో పెట్టుకుని, వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకునే దిశగా 155 రకాల వైద్యసేవలను అదనంగా నూతన పథకం క్రింద ప్రభుత్వాసుపత్రులకు కేటాయించడం జరిగింది.
నూతన ఆరోగ్య బీమా పథకం:- ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మిశ్రమ(హైబ్రిడ్) విధానంలో అందరికీ ఆరోగ్య బీమా పథకం కింద రాష్ట్రంలో 1.63 కోట్ల లబ్ధిదారుల కుటుంబాలకు సంవత్సరానికి రూ.2.5లక్షల మేరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా కల్పిస్తారు. ఇందులో మొదటిసారిగా పేదరిక రేఖ(Poverty line)కు పైనవున్న 20 లక్షల ఏ.పి.యల్ కుటుంబాలకు కూడా ఆరోగ్య బీమా లభిస్తుంది. ఉద్యోగస్తులకు, పాత్రికేయులకు ప్రత్యేక ఆరోగ్యసేవల పథకాలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం డా.యన్.టి.ఆర్ వైద్యసేవ కింద ఉచితంగా వైద్యం పొందుతున్న 1.43 కోట్ల కుటుంబాలకు రూ.2.5 లక్షలు దాటి రూ.25 లక్షల వరకు అయ్యే ఖర్చును డా.య్.టి.ఆర్.వైద్య ట్రస్టు ద్వారా ప్రభుత్వమే భరిస్తుంది.