స్టార్టప్ లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్- సీఎం చంద్రబాబు
ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు చోట్ల ఇన్నోవేషన్ కేంద్రాలను హబ్ అండ్ స్పోక్ మోడల్ లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. బుధవారం మంగళగిరిలోని మయూరి టెక్ పార్కులో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..”రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నాం.
గివ్ బ్యాక్ టు ది సొసైటీ:- రతన్ టాటా నిరాడంబరత, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శం. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించటం ఓ చారిత్రాత్మక సమయం. గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే విధానాన్ని రతన్ టాటా అవలంభించారు. రతన్ టాటా ఆలోచనల్ని భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఇన్నోవేషన్ హబ్ లను ప్రారంభించాం. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయి. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఇన్నోవేషన్ కేంద్రాలు ఉండాలని నిర్ణయించాం.
రికార్డుల స్థాయిలో రిజిస్ట్రేషన్లు:- ఏపీలో ఇన్నోవేషన్, బిజినెస్ స్టార్టప్ ల కోసం రికార్డు స్థాయిలో 1,67,321 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 24 గంటల్లో ఈ స్థాయి రిజిస్ట్రేషన్లు జరగటంపై ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డును ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందచేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో వివిధ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్ , నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి, అమర్ రాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా జయదేవ్ తదితరులు హాజరయ్యారు.