రామాయపట్నం పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి-కలెక్టర్ ఆనంద్
నెల్లూరు: పోర్టు ఆధారిత పరిశ్రమల రాకతో రామాయపట్నం పరిసర ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, అందులో భాగంగానే భూములిచ్చిన రైతుల కుటుంబాలకు అండగా ఉంటూ, స్థానిక యువత ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ అన్నారు.బుధవారం ఉదయం గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో ఇండోసోల్ సోలార్ పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ఇండోసోల్, బిపిసిఎల్ కంపెనీల ఏర్పాటుతో పెద్దఎత్తున స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం ఇండోసోల్ కంపెనీలో స్థానికులకు 68మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని, ప్రతినెలా కూడా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేలా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినట్లు చెప్పారు.
ఎమ్మేల్యే:- కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంత రూపురేఖలు సమూలంగా మారి కాకినాడ, విశాఖపట్టణం పోర్టుల తరహాలో రామాయపట్నం పోర్టు ప్రాంతం అభివృద్ధి చెందనున్నట్లు చెప్పారు. త్వరలోనే కందుకూరును ప్రకాశం జిల్లాలో చేర్చేందుకు సీఎం హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. ప్రతిరోజు కూడా నాలుగు గంటలు వృత్తి నైపుణ్యం పై శిక్షణ ఇస్తామని ఇండో సోల్ కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ అధికారి భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి,కంపెనీ వివిధ విభాగాల ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, స్థానిక గ్రామాల యువతీయువకులు, రైతులు పాల్గొన్నారు.