AP&TGDISTRICTS

అక్టోబర్ 2 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా తొలగించాలి-పిసిబీ ఛైర్మన్ కృష్ణయ్య

నెల్లూరు: సమాజం నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా తొలగించేందుకు అందరూ కట్టుగా కృషి చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య కోరారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ గురించి జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తో కలసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే అక్టోబర్ 2 వ తేదీ నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి ఆశయమని, అందుకనుగుణంగా అధికారులందరూ కృషి చేయాలన్నారు.

మొదటిగా అధికారులు తమ నుండే ప్లాస్టిక్ నియంత్రణ మొదలు పెట్టాలన్నారు. ఇటువంటి ప్లాస్టిక్ సంచుల తయారీ కు జిల్లాలో ఎటువంటి అనుమతి లేదని ఇతర ప్రాంతాల నుండి దిగుమతి అవుతున్న వాటిని వివిధ రకాల చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు. అదేవిధంగా హోల్సేల్ వ్యాపారం జరిగే ప్రదేశాల్లో నియంత్రించేందుకు దాడులు చేపట్టాలన్నారు. ఇందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో మల్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. అయితే చవకగా దొరికే ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా చేతి సంచులను తక్కువ ధరకు అందించగలిగినప్పుడే విజయవంతం అవుతుందన్నారు. ఇందుకోసం మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా తక్కువ ధరకు దొరికే సంచుల తయారీకి చర్యలు చేపట్టాలన్నారు.

జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ పోలీసు, రవాణా, సివిల్ సప్లై, మార్కెటింగ్ తదితర శాఖలు తమ విధుల్లో భాగంగా నిర్వహించే చెక్ పోస్టుల తనిఖీలలో ప్లాస్టిక్ కవర్ల రవాణాను విధిగా తనిఖీ చేయాలన్నారు. తనిఖీల అనంతరం సంబంధిత పంచాయతీ సెక్రటరీ ద్వారా పెనాల్టీ విధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది బస్సులలో ప్లాస్టిక్ సంచుల రవాణాను నిరోధించాలన్నారు. కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లు, దేవాలయాలు, ఆర్టీసీ బస్టాండ్లు తదితర రద్దీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ సంచులను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిపిఓ శ్రీధర్ రెడ్డి, డిటిసి చందర్, డీఎస్ఓ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *