రహదారులు, కూడళ్లు, గ్రీన్ బెల్ట్, బఫర్ జోన్లలో ఆహ్లాదకరమైన వాతావరణం-చంద్రబాబు
ప్రకృతి ఒడిలో అమరావతి..
అమరావతి: రాజధాని అమరావతి నగరాన్ని అతిపెద్ద లంగ్ స్పేస్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి ఇన్ నేచర్ అనే కాన్సెప్టుతో హరిత ప్రణాళికల్ని అమలు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్-బ్లూ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో నిర్మితం అవుతున్న ప్రధాన ట్రంక్ రోడ్లు, అనుబంధ రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్ల వద్ద నిర్మించే రహదారులు, బఫర్ జోన్లు, గ్రీన్ జోన్లు, ముఖ్యమైన కూడళ్లను అత్యంత ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు వీలుగా పచ్చదనాన్ని పెంపొందించాలని సీఎం స్పష్టం చేశారు. రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఔషధ మొక్కలు నాటటంతో పాటు రాజధాని ప్రాంతం అంతా జీవ వైవిధ్య ప్రాంతంగా మారాలని పేర్కొన్నారు. గ్రీన్ బెల్ట్ , బఫర్ జోన్లలో దేశీయ వృక్ష జాతులు ఉండేలా చూడాలని సూచించారు. అలాగే రివర్ ఫ్రంట్ ను అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.
బ్లూ, గ్రీన్, పుష్ప వికసిత రాజధాని:- గ్రీన్, బ్లూ నగరంగా అమరావతిని తీర్చిదిద్దటంతో పాటు ఏడాది పొడవునా వివిధ కాలాల్లో వేర్వేరు జాతుల పుష్పాలు వికసించి ఆహ్లాద పరిచేలా మొక్కలు నాటాలని సీఎం పేర్కొన్నారు. ప్రజలు, పర్యాటకులు వాటి గురించి మాట్లాడుకునేలా ఈ పుష్పాలు సీజన్ల వారీగా వచ్చేలా ప్రణాళిక చేపట్టాలని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో వివిధ ఫల, పుష్ప జాతులకు చెందిన మొక్కలు, చెట్లు ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ఏడీసీ అధికారులకు సూచించారు. అమరావతిని సుందరంగా తీర్చిదిద్దేందుకు బెంగుళూరు నగరంతో పాటు సింగపూర్ సహా వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. అలాగే ఔషధ మొక్కలు, అరుదైన, అంతరించి పోతున్న జాతుల మొక్కలు, వృక్షాలను కూడా సంరక్షిస్తున్న ప్రాంతంగా అమరావతి ఉండాలని సూచించారు
సేదదీరేలా కృష్ణా రివర్ ఫ్రంట్:- రాజధాని అమరావతి నగరంలోనూ అత్యంత నాణ్యమైన, అందరికీ అందుబాటులో గృహ నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సింగపూర్‌లోని బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు తరహాలోనే రాజధాని నగరంలో గృహ నిర్మాణ ప్రాజెక్టుల వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చెట్లు, పార్కులు నిర్మించాలని స్పష్టం చేశారు. 250 ఎకరాల ప్రాంతంలో 10 వేల మంది నివసించేలా బిడదారి ఎస్టేట్ ను నిర్మించారన్నారు.

