కార్మికులందరూ ఆప్కాస్ ద్వారానే జీతాలు అందుకుంటారు-కమిషనర్ నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ కార్మికులు పూర్తిస్థాయిలో ప్రస్తుత విధానంలోనే వారి విధులను కొనసాగిస్తారని, ఆప్కాస్ ద్వారానే క్రమం తప్పకుండా జీతాలను అందుకుంటూ ఉద్యోగ భద్రతకు పూర్తి భరోసా ఉంటుందని కమిషనర్ వై.ఓ నందన్ స్పష్టం చేశారు. గత 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని కార్పొరేషన్ కార్యాలయం కమిషనర్ చాంబర్లో విలేకరుల సమావేశాన్ని కమిషనర్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆలోచనల మేరకు నెల్లూరు నగరంలో 100% పారిశుద్ధ్య పనులుతో, అత్యంత పరిశుభ్రమైన మోడల్ డివిజన్ నిర్వహణలో పైలెట్ ప్రాజెక్టు కొరకు కాంట్రాక్టు పద్ధతిలో ప్రయోగాత్మకంగా చేపట్టామని తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో ప్రస్తుత కార్మికులను చేర్చడం, వారి ప్రస్తుత విధి విధానాలను మార్చడం వంటివి జరగవని స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జనాభా పెరుగుదల రేటు, పట్టణ అభివృద్ధి వంటి వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకొని అదనపు కార్మికుల ద్వారా వివిధ రకాల సేవలను అందించేందుకు నూతన విధానం ద్వారా అమలు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని కమిషనర్ తెలిపారు. కేవలం మున్సిపల్ శాఖలో మాత్రమే కాకుండా అన్ని శాఖలలో కాంట్రాక్టు విధానం ద్వారా అవసరమైన సేవలను అందించేందుకు అదనపు కార్మికుల నియామకం గురించి యోచిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య విభాగం, ఇతర విభాగాల కార్మికులందరూ ఈ విషయాలపై అవగాహన పెంచుకుని తమ విధులకు, జీతాలకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని అర్థం చేసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.నెల్లూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో నగర ప్రజలందరూ సంయమనం పాటించి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

