అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేయండి-కమిషనర్ నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అనధికార, అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని వార్డ్ సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శులను కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశించారు.వారాంతపు సమీక్షలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వార్డు ప్లానింగ్ కార్యదర్శి తమ సచివాలయాల పరిధిలోని మాస్టర్ డేటా ప్లాన్ ను తమ పని చేసిన కాలంలో భద్రపరచాలని సూచించారు. అక్రమ నిర్మాణాలను, అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించి పి.ఓ, సి.ఓ నోటీసులు జారీ చేసి నిర్దేశించిన సమయానికి నిర్మాణ పనులు ఆపకపోతే చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. నూతన భవన నిర్మాణాలకు సంబంధించి, ప్లాన్ అనుమతుల గురించి లేదా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదుల గురించి తమ లాగిన్లను ప్రతిరోజు తనిఖీ చేసుకోవాలని సూచించారు. లాగిన్ లలో ఏలాంటి ఫైళ్లు పెండింగ్లో ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు పరిష్కారానికై ఉన్నతాధికారులకు ఫార్వర్డ్ చేయాలని సూచించారు. సంబంధిత షార్ట్ ఫాల్స్ ను ఉన్నతాధికారులకు తెలియజేసి క్లియర్ చేయించాలని తెలిపారు. అనధికార లేఔట్లను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా సచివాలయ పరిధిలో పర్యటించి నూతన నిర్మాణాలను గుర్తించాలని, అదేవిధంగా రోడ్లపై ఉన్న ఆక్రమణలు, రోడ్డు మార్జిన్ దాటిన షాపుల బోర్డులు, ఫ్లెక్సీలు ఇతర అనధికార ప్రకటనలను తొలగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సి.పి హిమబిందు, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, ఏ.సి.పి వేణు, టి.పి.వో సతీష్, టి.పి.బి.ఓ లు, వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

