విజయదశమి నుంచి రోడ్లపైకి స్వీపీంగ్ మిషన్లు-మంత్రి నారాయణ
నెల్లూరు: విజయదశమి నుంచి నెల్లూరు సిటీలో రోడ్లను స్వీపీంగ్ మిషన్లతో శుభ్రం చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని తొమ్మిదో డివిజన్ ఎఫ్సీఐ కాలనీలో 60 లక్షల రూపాయలతో ఆధునికరించిన పార్క్, అదేవిధంగా 13 డివిజన్లో 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును నుడా చైర్మన్ తో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని చెత్త రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, విజయదశమి నుంచి నెల్లూరు నగరంలో అన్ని వార్డుల్లో మిషన్లతో రోడ్లను శుభ్రం చేయునట్లు చెప్పారు.

ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్నారు.ఆరు జిల్లాల్లో సాలిడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ లు ఏర్పాటు చేసామని.. లే అవుట్ ఎవరు వేసినా 10 శాతం స్థలం పార్కుకి వదలాలన్నారు..సిటీలో 56 స్థలాలను గుర్తించి పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పార్కుల్లో పిల్లల కోలాహలం చూస్తే ఆనందంగా ఉందన్నారు. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 165 కోట్లు మంజూరు చేసిన సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన ప్రతీ హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కమిషనర్ నందన్, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

