అవినీతిని సహించేది లేదు-రుజువైతే చర్యలు తప్పవు-సీఎం చంద్రబాబు
ఆరోపణలు వస్తే తక్షణ విచారణ..
అమరావతి: ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని,,జీరో కరెప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని,,అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి, వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్టు ఐవీఆర్ఎస్, సీఎస్డీఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని, అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని… సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం, ఉద్యోగాలకల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి…వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు.

