పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడి పెట్టాలి: సీఎం చంద్రబాబు
అమరావతి: సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.శుక్రవారం దిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు.
“ప్రస్తుతం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలే. నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా, చాలా మంది నాయకులను చూశాను. సరైన సమయంలో సరైన నాయకుడిగా మోదీ ప్రధానిగా ఉన్నారు. మోదీ నాయకత్వం దేశానికి ఓ ప్రధాన బలం. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాను. విశాఖలో టీసీఎస్ మొదలవుతోంది, ఆర్సెల్లార్ మిట్టల్ పరిశ్రమ ప్రారంభం కాబోతోంది. అలాగే విశాఖకు గూగుల్ రాబోతోంది” అని సీఎం చంద్రబాబు తెలిపారు.
“ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయి. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉంది. గ్రీన్ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఏడాదిలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు అందుకున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయి. మైనింగ్, టూరిజంలోనూ ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటవుతోంది. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్క్ లు ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.

