ఓటమిని ఒప్పుకొనే మనసు విపక్షానికి లేదు-చట్టసభల్లో డ్రామాలొద్దు-ప్రధాని మోదీ
చట్ట సభల్లో సానుకూలంగా చర్చలు జరగాలి..
అమరావతి: దేశ ప్రగతి కోసం పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సభా సమయాల్లో డ్రామాలు వద్దని, చట్టసభల్లో చర్చలు తప్పనిసరని హితవు పలికారు. పరాజయాన్ని అంగీకరించే మనసు ప్రతిపక్షాలకు లేదని అన్నారు. సోమవారం శీతకాల సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి మాత్రమే తమ ప్రధాన కర్తవ్యమని వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని కోరారు. పరాజయం కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని ఆరోపించారు. తాము మాత్రం విపక్షాలను కలుపుకొని ముందుకెళ్తనట్లు ప్రధాని చెప్పారు. దేశ ప్రగతి కోసం మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.

