పూడికతీత పనులకు అడ్డంకిగా ఉంటే మెట్లు, ర్యాంపులను తొలగించేస్తాం-కమిషనర్ నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో డ్రైను కాలువల పూడిక తీత పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని, సిల్ట్ ను రోడ్లపై ఉంచకుండా ప్రణాళిక బద్దంగా తొలగించేయాలని కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 17 వ డివిజన్ ఆకుతోట, బాబా నగర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ సోమవారం పర్యటించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా డ్రైను కాలువల పూడికతీత పనులతో పాటు పూర్తిస్థాయిలో సిల్ట్ తొలగించేందుకు నగరం మొత్తం చిన్న, పెద్ద డ్రైను కాలువల్లో డీసిల్టేషన్ పని మొదలుపెట్టామని తెలిపారు. అన్ని డివిజన్లలో గ్యాంగ్ వర్క్ చేపట్టి డ్రైను కాలువలను ఆక్రమిస్తూ నిర్మించిన ఆక్రమణలు, ర్యాంపులు, మెట్లను తొలగించి వంద శాతం సిల్ట్ తొలగింపు పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి డ్రైను కాలువల అడుగు భాగంలో పేరుకుపోయిన సిల్ట్ ను మిషన్ల సహాయంతో తొలగించడంతో దోమల ఎదుగుదలకు అవకాశం లేకుండా పోతుందని, దోమల శాశ్వత నిర్మూలనకు పూడికతీత పనులు ఉపయుక్తమవుతాయని కమిషనర్ తెలిపారు. డ్రైను కాలువలను ఆక్రమిస్తూ సమీప గృహాల వారు ఏలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టరాదని, డ్రైను కాలువల పూడికతీత పనులకు అడ్డంకిగా ఉంటే ఇంటికి సంబంధించిన మెట్లు, ర్యాంపులు, తదితర నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించేస్తామని కమిషనర్ తెలియజేశారు. రోడ్లపై నిరుపయోగంగా ఉన్న వాహనాలు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు తదితర వాటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.