జిల్లాలో 197 తాగునీటి పనులకు రూ.103.38 కోట్లు మంజూరు-కలెక్టర్ హిమాన్షు శుక్ల
గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి..
నెల్లూరు: జిల్లాలో తాగునీటి ఎద్దడిని పూర్తిగా నివారించేందుకు 197 తాగునీటి పనులకు రూ. 103.38 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్ల తెలిపారు.ఆర్డబ్ల్యుఎస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డెవలప్మెంటు పథకంలో భాగంగా పూర్వోదక స్కీమ్ (జల్జీవన్ పథకం) అనుసంధానంతో ఈ నిధులను జిల్లాలోని తాగునీటి పథకాలకు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న గ్రామాల్లో తాగునీటి పథకాల రిపేర్లు, ఇంటింటికి కుళాయి కనెక్షన్ల ఏర్పాటు, ఓవర్హెడ్ ట్యాంకుల రిపేర్లు, నూతన ట్యాంకుల నిర్మాణం, నిరుపయోగంగా ఉన్న సమగ్ర గ్రామీణ నీటి పథకాలను పునరుద్ధరించుటకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఈ పనులన్నీంటిని కూడా 2026 డిసెంబరులోగా పూర్తి చేసేందుకు ఆర్డబ్ల్యుఎస్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో 36 పనులకు 13.43 కోట్లు, గూడూరు నియోజకవర్గంలో 16 పనులకు 7.44 కోట్లు, కావలి నియోజవర్గంలో 2 పనులకు 14.76 కోట్లు, కోవూరులో 34 పనులకు 22.26 కోట్లు, నెల్లూరు రూరల్ 13 పనులకు 4.11 కోట్లు, సర్వేపల్లి 44 పనులకు 13.26 కోట్లు, ఉదయగిరి 40 పనులకు 23.72 కోట్లు, వెంకటగిరి 12 పనులకు 4.36 కోట్లు మొత్తం 103.38 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు.

