AP&TG

అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ సంస్థకు సీఎం చంద్రబాబు భూమి పూజ

అమరావతిలో ప్రపంచ స్థాయి నేత్ర వైద్య కేంద్రం..

స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పాన్ ఐఐటీ నిపుణులు..

అమరావతి: రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థకు అడుగులు పడ్డాయి. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి నిర్మాణ పనులను ప్రారంభించారు. సుధా, వెంకట్ జాస్తి క్యాంపస్ పేరుతో 12 ఎకరాల్లో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్మించనున్నారు. ఏటా సుమారు 3 లక్షల మందికి కంటి వైద్య సేవలు అందించేలా ఆస్పత్రి నిర్మాణం కానుంది. చికిత్సలతో పాటు నేత్ర వైద్య పరిశోధన, శిక్షణ, కమ్యూనిటీ హెల్త్ కార్యక్రమాలపైనా సంస్థ దృష్టి సారించనుంది. ప్రత్యేకంగా ఐ అండ్ బ్రెయిన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే 3 కోట్ల కంటి చికిత్సలు:- భూమిపూజ అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి… శరవేగంగా నిర్మితమవుతున్న అమరావతికి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ రావడం గర్వకారణమన్నారు. ఇప్పటికే 3 కోట్ల కంటి చికిత్సలు అందించిన సంస్థ అమరావతి నుంచి మరింత విస్తృతంగా సేవలందిస్తుందని తెలిపారు. అమరావతి కేంద్రాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ నేత్ర వైద్య పరిశోధన సంస్థగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కంటి చికిత్సలతో పాటు పరిశోధన, శిక్షణ రంగాల్లోనూ ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదగాలని కోరారు.పేదలకు కంటి వైద్యం అందించడంలో ఎల్వీ ప్రసాద్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని సీఎం పేర్కొన్నారు. అమరావతిలో ఐ అండ్ బ్రెయిన్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న జీఎన్ రావు, జాస్తి వెంకట్‌లను సీఎం అభినందించారు.

క్వాంటం కేంద్రంగా అమరావతి:- ఇప్పుడు అమరావతి గురించి దేశం అంతా  మాట్లాడుతోందని…మన ప్రజా రాజధానిని ప్రపంచం కూడా గుర్తిస్తోందని సీఎం అన్నారు. నోపోల్ సిటీ, బ్లూ-గ్రీన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, డీప్‌టెక్ క్యాపిటల్‌గా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంతో పాటు విస్తృతంగా హరిత ప్రాంతాలను అభివృద్ధి చేసి, గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఐటీ తర్వాత క్వాంటం కంప్యూటింగ్‌పై దృష్టి సారించామని సీఎం తెలిపారు. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం అమరావతిలో ఏర్పాటు అవుతోందన్నారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంస్థల భాగస్వామ్యంతో 133 క్యూబిట్ సామర్థ్యం కలిగిన క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 21 క్వాంటం స్టార్టప్‌లు అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఐదు క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు మూడు క్యూబిట్ కంప్యూటర్లను తయారు చేశాయని పేర్కొన్నారు. అక్టోబరు 3న వివిధ విశ్వవిద్యాలయాల్లో క్వాంటం కంప్యూటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

రాజధానిలో రూ.50 వేల కోట్ల పనులు:-  అమరావతిలో ప్రస్తుతం సుమారు రూ.50 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్లు, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక మౌలిక వసతులు రానున్నాయని చెప్పారు. విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృతానందమయి సంస్థలు ఇప్పటికే వచ్చాయని, త్వరలో బిట్స్ పిలానీ క్యాంపస్, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి సంస్థలు కూడా రానున్నాయని తెలిపారు. నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని సీఎం చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *