సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లి,సుందర్
అమరావతి: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న) ఆలయాన్ని ఆదివారం మరో స్టార్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తో కలసి దర్శించుకున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో విజయం సాధించిన సందర్భంగా కోహ్లీ స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం, ఆలయ పురాణ ప్రాధాన్యత కలిగిన కప్ప స్తంభాన్ని ఆయన ఆలింగనం చేసుకున్నారు. దర్శనం పూర్తయ్యాక ఆలయ అర్చకులు కోహ్లీ. సుందర్ లకి వేద ఆశీర్వచనం ఇచ్చి సన్మానించారు. దేవస్థానం అధికారులు వీరికి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. ఇటీవల టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు.

