AP&TG

సంఘ్‌ని అర్థం చేసుకోవాలంటే సంఘ్ నుంచే అనుభవం రావాలి-డాక్టర్ మోహన్ భాగవత్

హైదరాబాద్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ని అర్థం చేసుకోవాలంటే ఆ అనుభవాన్ని సంఘ్‌లో భాగం కావడం ద్వారానే పొందాలని RSS సర్‌సంఘ్‍చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. RSS ప్రారంభం అయి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏ సంస్థ అయినా ఉత్సవాలు చేసుకుంటుందని, కానీ స్వయంసేవకులు అలా ఆలోచించక, వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం అనే సంఘ కార్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకుని పలు కార్యక్రమాల యోచన చేశారని తెలిపారు. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా హైదరాబాదులో “100 ఏళ్ళ సంఘ్ యాత్ర-కొత్త ఆశయాలు”  పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 1000 మంది వరకూ పాల్గొన్న  వివిధ రంగాల మేధావులను ఉద్దేశించి డాక్టర్ మోహన్ భాగవత్ ప్రసంగించారు. అంతకు ముందు హైదరాబాదులో సీనియర్ బ్యూరోక్రాట్స్, సినీరంగ ప్రముఖులతో సమావేశమై RSS వందేళ్ళ ప్రస్తానం, లక్ష్యం, ఆశయాలు వంటి పలు అంశాలను తెలియజేశారు.

పైపైన అర్థం చేసుకుంటే తప్పుగా కూడ:- గత ఇరవై ఏళ్లలో సంఘ కార్యం ఎంతో విస్తరించిందని తెలియజేస్తూ సంఘ్‌ను అర్థం చేసుకోవడం చాలా కష్టమని, సంఘ్ లాంటి పని సమాజంలో మరొకటి లేదని ఒకవేళ పైపైన అర్థం చేసుకుంటే తప్పుగా కూడ అర్థం కావొచ్చని అప్రమత్తం చేశారు.  అందుకే, సంఘ్‌లో భాగం కావడం ద్వారానే సంఘ కార్యాన్ని అర్థం చేసుకుని అనుభవాన్ని పొందాలని అన్నారు. “సంఘ్ మొదటి సిద్ధాంతం ఉత్తమ దేశ నిర్మాణం లక్ష్యంగా వ్యక్తి నిర్మాణం చేయడం. సమాజంలో ఏకత, గుణాత్మకత వచ్చేవరకూ దేశ భవితవ్యం మారదని, మారకుంటే మనం ప్రమాదంలో పడినట్లేనని అప్రమత్తం చేశారు.

హిందువుగా జీవిస్తున్నప్పటికీ:- నేడు హిందూ సమాజంలో తాము హిందువులమని గర్వించేవారు, హిందువులమని వ్యక్తిగతంగా మాత్రమే అంగీకరించేవారు, హిందువుగా జీవిస్తున్నప్పటికీ బయటకు వ్యక్తం చేయనివారు, అసలు హిందువులమన్న మూలాలనే మరచినవారు ఇలా భిన్న వర్గాలున్నాయని డాక్టర్ మోహన్ భాగవత్  తెలియజేశారు.  అందరమూ ఒకే సంస్కృతికి చెందినవారం కాగా, అందరిలోనూ ఉమ్మడిగా ఈ చైతన్యం మేల్కొనేలా చేయడం నేడు సమాజం ముందున్న బాధ్యత అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *