AP&TGDISTRICTS

టిడ్కోఇళ్ల గృహప్రవేశాలు-డిసెంబర్‌లోపు మరో 4.5 లక్షల ఇళ్లు- సీఎం చంద్రబాబు

2,50,893 ఇళ్లు అప్పగింత..

తిరుపతి: ఈ ఏడాది చివరి నాటికి మరో 4.5 లక్షల గృహాలను పేదవారికి నిర్మించి ఇస్తామని, జూన్, సెప్టెంబరు నెలల్లో గృహ ప్రవేశాలు చేసేలా లబ్దిదారులకు ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుపతిజిల్లా నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30కి పైగా చోట్ల నిర్మించిన 2,50,983 టిడ్కో, పీఏఏవై ఇళ్లను లబ్దిదారులకు అప్పగించారు. తాను హాజరైన ఒక్క తిరుపతి జిల్లాలోనే 15,659 ఇళ్లను నిర్మించి ఇచ్చామని సీఎం వివరించారు. నాయుడుపేటలోని పుదూరు వద్ద జీ ప్లస్ 3 తరహాలో నిర్మించిన భవన సముదాయాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. పార్కులు, వాకింగ్ ట్రాక్, విశాలమైన రహదారులు, అంగన్‌వాడీ, స్కూలు తదితర సదుపాయాలతో నిర్మించిన ఈ టిడ్కో భవనాలను ప్రారంభించిన అనంతరం లబ్దిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. హైందవ సంప్రదాయ ప్రకారం నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను బహూకరించారు.

ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలు:- అందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రాష్ట్రంలో పేదలకు ఉచితంగా ఇళ్లస్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి వివరించారు. భవిష్యత్తులో ప్రతీ ఇంటికీ పైపు ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. ఉచిత సిలెండర్ కు ఇచ్చే డబ్బులు ప్రతీ రెండు నెలలకూ వినియోగదారులకు చెల్లిస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కూడా గత పాలకులు నిర్వీర్యం చేశారన్నారు. కేంద్రాన్ని ఒప్పించి 2028 వరకూ ఈ పథకం కొనసాగించేలా చేశామన్నారు.

2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుందని.. మహిళలకూ చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే మహిళలకు టీడీపీ, ఎన్డీఏలు స్వాగతం పలుకుతాయన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతోనే అనునిత్యం పనిచేస్తున్నామని సీఎం వివరించారు.

మత్స్యకారులకు అండగా ప్రజాప్రభుత్వం:- అటానమస్ షిప్ యార్డు వల్ల స్థానిక మత్స్యకారులు ఎవరికీ అన్యాయం జరగదని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పొరుగు రాష్ట్రాల జాలర్లు మన జలాల్లోకి రానివ్వకుండా కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు, పాండిచ్చేరి నుంచి వచ్చిన జాలర్లు ఈ ప్రాంతంలో చేపల వేట చేసుకోడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అవసరం మేరకు మరో 4 బోట్లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, కొలుసు పార్ధసారధి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *