గ్యాస్ కోసం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు-పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల
ఏజెన్సీల పెండింగ్ సరఫరాలపై నిఘా..
6 నుంచి 9 ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటున్నాం..
అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా గృహ అవసరాలకు సంబంధించిన వంట గ్యాస్ కొరత లేదని, ప్రజల్లో అపోహలు, భయాందోళనలు కలిగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు సూచించారు.
శుక్రవారం కానూరు సివిల్ సప్లైస్ భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా వాస్తవ పరిస్థితిని అంచనావేస్తున్నామని రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను మూడు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్పీసీఎల్ (IOCL, BPCL, HPCL) వంటి ప్రధాన ఆయిల్ కంపెనీలు సప్లై చేస్తున్నాయన్నారు. ప్రజల్లో నెలకొన్న అనవసర అపోహలు, భయాలను పారదోలేలా అధికారులు పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ముఖ్యంగా గృహ అవసరాలకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా గ్యాస్ సరఫరా చేస్తున్నామన్నారు.
కేంద్రం ప్రకటించిన ఎసెన్షియల్ కమర్షియల్ యాక్ట్:- యుద్దం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్యాస్ పరిస్థితులను చూస్తూ రాష్ట్రంలో గ్యాస్ ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ నెల 9న ఎసెన్షియల్ కమర్షియల్ యాక్ట్ ను కేంద్రం ప్రకటించిన దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతుందన్నారు. పౌర సరఫరాలు శాఖ ఆధ్వర్యంలో అన్ని వివరాలు తెప్పించుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో గతం లో రోజుకు 1 లక్ష 80 వేల వరకు, రద్దీ సమయాల్లో ఎక్కువగా దాదాపు 1,96,000 వరకు గ్యాస్ బుకింగ్స్ జరిగాయన్నారు. 21 న మనకి రావాల్సిన నౌక 25 న రాబోతుంది అని కేంద్రం తెలియపరచిందన్నారు. ఆన్లైన్ ద్వారానే బుకింగ్స్ చేసుకోవాలి అని ఓటీపీ ద్వారా 100 శాతం గ్యాస్ అందేలా చేస్తున్నామన్నారు. ఓటీపీ వస్తేనే బుక్ అయినట్లు గా నిర్దారణ చెందుతుందన్నారు.
6 నుంచి 9 ఏజెన్సీలపై చర్యలు:- బ్లాక్ మార్కెట్ పై మీడియా లో వచ్చిన కధనాల ప్రకారం ఉక్కుపాదం మోపుతామన్నారు. గ్యాస్ ఏజెన్సీస్ అన్నిటికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి ఒక్కర లిస్ట్స్ మా దగ్గర వున్నాయి, ఎక్కడైనా గ్యాస్ పక్కదారిపడితే చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని హెచ్చరిస్తున్నామన్నారు. ఇప్పటికే అలాంటి చర్యలకు పాల్పడిన 6 నుంచి 9 ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం కిరోసిన్ కూడా అందించమని ప్రకటించిందని, త్వరలోనే కిరోసిన్ సరఫరా చేస్తామన్నారు. ఏపీని గతంలోనే కిరోసిన్ రహితంగా చేసామని,కానీ పరిస్థితుల దృష్ట్యా వాడకం మళ్ళీ మొదలు పెట్టాలని, ముందుగా ఏజెన్సీస్ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వబోతున్నామన్నారు. జిల్లా స్థాయిలోనూ జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని గ్యాస్ సరఫరా వాస్తవ పరిస్థితిని అందిస్తున్నారన్నారు.

